January 26, 2010

Movie: మహాత్మ

శ్రీకాంత్ కు ఇది వందవ చిత్రం. సమకాలీన రాజకీయ పరిస్తితులకు అద్దం పడుతూ కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో విడుదలైన ఈ చిత్రం గత రెండు మూడు సంవత్సరాలలో విడుదలిన చిత్రాలలో అత్యంత ఆలోచింప చేసేదిగా చెప్పుకోవచ్చు. వ్యాపారమే లక్ష్యంగా సూపర్ మాన్ లా ఫైట్లు చేసే హీరో, చాలీ చాలని బట్టలతో గంతులేసే హీరోయిన్, పాత చింతకాయ పచ్చడి లాంటి ప్రేమ కథలతో నిండి ఉన్న నేటి తెలుగు సినిమాలన్నింటిలో ఈ సినిమా ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది.

కథ విషయానికి వస్తే, దాస్(శ్రీకాంత్) ఒక వీధి రౌడి. ఇతడు చేసే పాడు పనులన్నింటికి ఒక మహాత్ముని విగ్రహం మూగ సాక్షిగా ఉంటుంది. సినిమాలో చాల సన్నివేశాలకు ఈ మహాత్ముని విగ్రహం ప్రధాన భూమిక పోషిస్తుంది. చిన్న చిన్న సెటిల్ మెంట్లు చేసే దాస్ ఉండే వీధిలో ఒకరోజు సినిమా షూటింగ్ జరుగుతుంది. రంగుల ప్రపంచంలోని విలసవంతమైన జీవితాన్ని కళ్ళతో చూసిన దాస్, తను కూడా ఒక హీరో ఐపోదామని ఒక స్టూడియోకి వెళ్లి హీరోతో గొడవ పెట్టుకుంటాడు. సినిరంగంలో బంధువులు కాని, సరిపోయేంత డబ్బు కాని లేకపోతె హీరో కావటం కష్టం అని గ్రహించి, MLA అయిన దాదా దగ్గర పార్టీ కార్యకర్తగా చేరిపోతాడు. అంటే దాదా రాజకీయ అండతో హీరో ఐపోదామని దాస్ ఆలోచన. కొన్ని రోజుల్లోనే దాదాకు, దాస్ ఒక నమ్మకస్తుడైన కార్యకర్తగా మారతాడు. దాదా అండతో కార్పొరేటర్ కూడా అవుతాడు. కాని చివరికి తన కొడుకుని హత్యకేసు నుంచి తప్పించటానికి దాస్ ను తానే ఆ హత్య చేసినట్లు ఒప్పుకోమని చెప్తాడు దాదా. ఇప్పుడే దాదా అసలు రాజకీయ రంగు దాస్ కు భోధ పడుతుంది. ఇంక చివరికి తానే స్వయంగా దాదా మీద ఎన్నికల్లో పోటి చేద్దామని నిర్ణయించుకుంటాడు దాస్. దాస్ కు ధన బలం కానీ, బంధు బలం కానీ లేదని ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వదు. కాబట్టి తనే సొంతంగా "మహాత్మ పార్టీ" ని స్తాపించి ఎన్నికల ప్రచారం మొదలు పెడతాడు. ఈలోపు దాదా చనిపోతే ఆ సెంటిమెంట్ వోట్ తో తను గెలవచ్చని దాదా కొడుకు పైడమ్మ దాదాని చంపటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు దాదా చివరికి తన వాళ్ళంటూ ఎవరు లేరని గ్రహించి ఒక్క దాస్ మాత్రమే తనను కాపాడగలదని దాస్ కు ఫోన్ చేసి సహాయం అర్దిస్తాడు. దాస్ వచ్చి దాదాను కాపాడతాడు. చివరికి నామినేషన్ వేసే సమయంలో దాస్ తన మనసు మార్చుకుని నామినేషన్ వేసే ఛాన్స్ వేరే సామాజిక కార్యకర్తకు ఇస్తాడు.

ఇంచుమించు "ఆపరేషన్ దుర్యోధన" లాగానే ఈ సినిమాకు కూడా ప్రధాన అంశం సమకాలీన రాజకీయాలే. కాని దీంట్లో మనం చరిత్ర లో భారతావనిని కోసం పోరాడిన గొప్ప గొప్ప నాయకులూ, ఇంక వారి ఆదర్శాలను గురించి కూడా చూడొచ్చు. ఇంకా అహింసకు కూడా ఒక ప్రత్యేక స్తానాన్ని కల్పిస్తుంది ఈ సినిమా. అప్పుడప్పుడు, మర్చిపోయిన అమరవీరులను మనకు గుర్తు చేస్తూ బళ్ళారి చెప్పే విమర్శనాత్మక డైలాగులు ఈ సినిమా మొత్తానికే హైలైట్. బడా రాజకీయ నాయకులు కార్యకర్తలను తమ రాజకీయ చదరంగంలో ఎలా విలువ లేని పావులుగా ఉపయోగించుకుంటారో మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడు. రంగుల ప్రపంచంలో తెరవెనుక జరిగే విషయాలను కూడా చూపించాడు. రాజకీయ నాయకులూ చేసే ప్రజా ఉద్యమాల వెనక స్వంత ప్రయోజనాల్ని కూడా కొంత వరకు చూపిస్తాడు. సామాన్య ప్రజలు ఎలా రాజకీయ నాయకుల చేతిలో మోసపోతున్నారో విమర్శనాత్మంగా చూపించిన వైనం చాలా బాగుంది.

ఆధునిక భారతదేశంలో గాంధీ ఎలా కరెన్సీ నోటుపై బొమ్మలా, ఒక సెలవులా మారిపోయాడో చాల చక్కగా విమర్శిస్తాడు. అహింసకు ఒక ప్రత్యేక స్తానం కల్పించినప్పటికీ, దాన్ని ఒక గొప్ప ఆయుధంగా చూపించటంలో మాత్రం దర్శకుడు విఫలం అయ్యాడు. సినిమాలో ఉండే హింసే దీనికి సాక్షి. చాలా ఇతర సినిమాల లాగానే అహింసను ఒక గొప్ప సిద్ధాంతంగా చూపించాడే తప్ప, అది నిజంగా, మహాత్మునిలా ప్రజా జీవితం లో అన్నింటికన్నా గొప్ప ఆయుధం అని చూపించలేకపోయాడు.

ఇంకా ఈ మద్య వస్తున్న అన్ని సినిమాల లాగానే, పోలీసు వ్యవస్థను కొంచెం పాజిటివ్ గానే చూపించాడు. ముఖ్యంగా దాదా కొడుకు హత్యకేసు లో ఇరుక్కున్నప్పుడు, దాస్ దాదా ను తనకు తెలిసిన విషయాలన్నీ పోలీసులకు చెప్తా అని అన్నప్పుడు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఇంకా పోలీసులకు, చట్టానికి బయపదతారని చూపించాడు.

ఈ సినిమా లో కొన్ని ఆసక్తి కరమైన అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా, గాంధీ మిగత సినిమాల్లా కేవలం భారత్ కు మాత్రమే కాకుండా కాకుండా ఉపఖండానికి మొత్తానికి స్వాతంత్ర్యం తెచ్చాడని చూపిస్తాడు. ఇంకా మనం 800 వందల సంవత్సరాల నుంచి బానిసత్వంలో బతికామని అనటం చరిత్రను వక్రీకరించడమే. చివరికి MLA పోటీ చెయ్యటానికి ఒక సామాన్య మనిషికి అవకాశం ఇచ్చి ఏ మాత్రం పదవి వ్యామోహం లేని గాంధీని గుర్తుకు తెస్తాడు.

శ్రీకాంత్ నట జీవితం లో ఇదొక కలికితురాయిలా మిగిలిపోతుంది. ముఖ్యంగా కోపాన్ని ప్రదర్శిస్తూ, ఎలా ఒక్కో విషయం తను రియలైస్ అవుతూ, ప్రేక్షకులను కూడా రియలైస్ ఐయ్యేట్లు శ్రీకాంత్ చేసిన నటన తిరుగులేనిది. కృష్ణ వంశీ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది.

నేను మాములుగా తెలుగు సినిమాలు హాస్యం ఉంటే తప్పించి ఎక్కువగా చూడను. కానీ ఈ సినిమా కొంచెం డిఫరెంట్ అని మాత్రం చెప్పగలను.

No comments: